: ఇంటర్ నుంచే విద్యార్థులను సిద్ధం చేయండి.. బీజేపీ పార్లమెంటరీ భేటీలో మోదీ
యువతకు రాజకీయాలపై ఉన్న దురభిప్రాయాన్ని పారదోలేందుకు ఇంటర్, 12వ తరగతి నుంచే విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ సూచించారు. గురువారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని యువతను లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలకు యువత ప్రచారకర్తలుగా మారాలని కోరారు.
సమాచారం కోసం యువత ఎక్కువగా సెల్ఫోన్లపైనే ఆధారపడుతోందని, వారిని ఆకర్షించేందుకు పార్టీ శ్రేణులు కూడా సెల్ఫోన్లను ఆయుధంగా మలచుకోవాలన్నారు. దేశాన్ని అభివృద్ధిబాటలో నిలిపేందుకు తాను నిరంతరం శ్రమిస్తుంటానని, అందరూ తనలాగే పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలను సవాలుగా తీసుకుని పనిచేయాలని బీజేపీ చీఫ్ అమిత్‌షాను మోదీ కోరారు.