: రైల్వేకు మతిపోయే షాకిచ్చిన లుథియానా కోర్టు.. రైతుకు రైలును ఇచ్చేయాలంటూ సంచలన తీర్పు!


లుథియానాలోని జిల్లా అడిషనల్ కోర్టు ఉత్తర రైల్వేకు దిమ్మదిరిగే షాకిచ్చింది. రైతు నుంచి భూమిని తీసుకుని నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైన ఉత్తర రైల్వే తీరుపై మండిపడిన కోర్టు.. అమృత్‌సర్-న్యూఢిల్లీ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది  ఎక్స్‌ప్రెస్ రైలును రైతుకు ఇచ్చేయాలంటూ సంచలన తీర్పు వెల్లడించింది.

లుథియానా-చండీగఢ్ రైల్వే లైను కోసం ఉత్తర రైల్వే 2007లో భూసేకరణ చట్టం కింద లుథియానాకు చెందిన సంపూరణ్ సింగ్ అనే రైతు భూమిని సేకరించింది. బదులుగా రూ.కోటికి పైగా నష్టపరిహారం చెల్లించాల్సిన రైల్వే రూ.42 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో సంపూరణ్ 2012లో కోర్టుకెక్కాడు. కేసును విచారించిన న్యాయస్థానం బాధితుడికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని 2015లో ఆదేశించింది. అయినా రైల్వే నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సంపూరణ్ మరోమారు కోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన లుథియానా కోర్టు న్యాయమూర్తి జస్‌పాల్ వర్మ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12030) రైలును రైతుకు ఇస్తున్నట్టు తీర్పు చెప్పారు.

కోర్టు ఆర్డర్‌తో లుథియానా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రైతు కోర్టు ఆదేశాలను రైలు డ్రైవర్ ‌కు చూపించి, రైలును తనకు అప్పజెప్పాలని కోరాడు. దీంతో హడావుడిగా అక్కడకు చేరుకున్న సెక్షన్ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ రైలును కోర్టుకు స్వాధీనం చేస్తామని పేర్కొన్నారు. రైలులో ప్రయాణికులు ఉండడంతో వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రైలును ఆపలేదని సంపూరణ్ పేర్కొన్నాడు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో కొన్ని సమస్యలు వచ్చాయని, ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు రైల్వే డివిజన్ మేనేజర్ అనుజ్ ప్రకాశ్ తెలిపారు. కోర్టు ఆదేశాలను కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News