: కేసీఆర్, కేటీఆర్‌ల ఆస్తులు రూ. వేల కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలి!: రేవంత్ రెడ్డి డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మరోమారు ఫైరయ్యారు. గురువారం మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రేవంత్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు శిక్ష తప్పదన్నారు. అబద్ధాలను, ఆరోపణలను రుజువు చేయకుంటే జైలుకు వెళ్లాలనే చట్టం తెస్తే కేసీఆర్‌కు యావజ్జీవ శిక్ష పడుతుందని, ఆయన జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అప్పులు చేయడాన్ని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్‌ల ఆస్తులు రూ. వేల కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర అప్పులు రూ.69 వేల కోట్లు అయితే ఇప్పుడు రూ.1.40 వేల కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్రంలోని నవజాత శిశువు తలపైనా రూ.40 వేల అప్పు ఉందన్నారు. అప్పులు చేయడాన్ని సమర్థతగా, అవి చేస్తేనే అభివృద్ధి అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు, తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పత్రికలు, టీవీ చానల్, వందలాది ఎకరాల్లో ఫాంహౌజ్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.