: రుణమాఫీపై మోదీ అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎందుకిలా?


ఒకప్పుడు రుణమాఫీ పేరెత్తితే విరుచుకుపడిన మోదీ తాజాగా యూపీ ఎన్నికల్లో అదే అంశంతో ఘన విజయం సాధించారు. ఏపీ, తెలంగాణలోని టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి కూడా రుణమాఫీ హామీనే దోహదం చేసింది. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు ఉభయ రాష్ట్రాల సీఎంలు ఆర్థిక సాయం కోరేందుకు వెళితే మోదీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ‘‘అదేం కుదరదు’’ అంటూ ముఖం మీదే చెప్పేశారు. ఆర్థిక సాయం కాకున్నా, కనీసం రీషెడ్యూలింగ్‌కో, చెల్లింపుల వాయిదాకో ఆర్బీఐని ఒప్పించాలన్న కోరికను కూడా ఆయన మన్నించలేదు. కష్టాల్లో ఉన్నాం, కనికరించండని వేడుకున్నా పట్టించుకోలేదు.

కానీ, ఇప్పుడు తన సొంత లబ్ధి కోసం ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీ హామీ ఇవ్వడమే కాకుండా దానిని భరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. యూపీ రుణభారాన్ని కేంద్రం మోస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. అంతేకాదు, రైతులకు రాష్ట్రాలు రాయితీ ఇవ్వాలనుకోవడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు.

ఆయన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా రుణమాఫీ ప్రకటించింది రైతులకేనన్న విషయం కేంద్రానికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఉభయ తెలుగు ప్రభుత్వాలు కేంద్రాన్ని కలిసి ఈ విషయంలో నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లోక్‌సభలో 90 నిమిషాలు మాట్లాడిన రాధామోహన్‌సింగ్ ఇతర రాష్ట్రాల్లోని రుణమాఫీ భారాన్ని కేంద్రం భరిస్తుందన్న ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. దీంతో మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రా? లేక యూపీకా? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  

  • Loading...

More Telugu News