: ధర్నా చౌక్ తరలింపు నిర్ణయంపై మండిపడుతున్న నేతలు!
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర నుంచి ధర్నాచౌక్ ను తరలించాలనే ప్రభుత్వ నిర్ణయం సబబు కాదని, దీనిని అడ్డుకుంటామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు కలిశారు. ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు.
అనంతరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇదే విషయమై స్పందిస్తూ, ధర్నా చౌక్ ను తరలించడం అన్యాయమని, ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్ని నిర్బంధాలు విధించినా ధర్నా చౌక్ లోనే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.