: దుండగుల బారి నుంచి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క!
తనను పెంచుకుంటున్న యజమానిపై ఓ కుక్క అమితమైన విశ్వాసం చూపించి వార్తల్లోకెక్కింది. తన యజమాని ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన తాజాగా బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. అక్కడ నివసించే ఓ ప్రొఫెసర్ ఉదయం 5.30 గంటలకు పాల కోసం బయలుదేరుతూ తన పెంపుడు కుక్క లియోను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. ప్రతిరోజు ఆయన తన స్కూటర్‌పై ఒంటరిగానే వెళతాడు.. అయితే, మొదటిసారి ఆయన తన పెంపుడుకుక్కను తీసుకొని స్కూటర్ పై వెళ్లాడు. అదే ఆయన ప్రాణాలను కాపాడుతుందని ఆ ప్రొఫెసర్ ఊహించలేదు.
షాపులో పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వస్తుండగా ఓ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఆయన స్కూటర్‌ను కారుతో గుద్దారు. అనంతరం కారు దిగి ప్రొఫెసర్‌పై దాడికి యత్నించారు. అందులో ఒకరు సదరు ప్రొఫెసర్ అరవకుండా నోటిని తన చేత్తో అదిమిపట్టాడు. ఇంకొకరు కత్తి పట్టుకుని ఆయన్ని బెదిరించాడు. ఆయన మెడలోని బంగారు గొలుసుతో పాటు విలువైన వస్తువులన్నీ ఇచ్చేయమన్నాడు. అలాగే ఇచ్చేస్తానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. అయితే, ఆయన మెడ మీద కత్తిపెట్టిన వ్యక్తిపై ఆ కుక్క దాడిచేసి అతడిని గాయపరిచింది. అనంతరం మిగతా ఇద్దరిని కూడా కరవడానికి ప్రయత్నించింది. దీంతో ఆ దుండగులు పరుగులు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.