: ఆ కశ్మీర్ అమ్మాయిని అప్పుడు తిట్టారు...ఇప్పుడు పొగుడుతున్నారు!
జమ్మూకశ్మీర్ కు చెందిన బాలిక తజాముల్ ఇస్లామ్ ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న అనంతరం మర్యాదపూర్వకంగా సీఎం ముఫ్తీని కలిసిన సమయంలో కశ్మీరీలు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న సమయంలో సీఎంను కలవడమేంటని పలువురు తిట్లదండకం అందుకున్నారు. అప్పుడు అంతలా తిట్టినవారంతా ఇప్పుడు తజాముల్ ఇస్లామ్ ను ప్రశంసిస్తున్నారు.
దీనికి కారణం ఏమిటంటే, తను శిక్షణ పొందుతున్న అలీ స్పోర్ట్స్ అకాడమీలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ తాజాగా తజాముల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేసింది. అటువంటి పరిస్థితులలో అత్యుత్తమ క్రీడాకారులు ఎలా వెలుగులోకి వస్తారని ప్రశ్నించింది. స్పోర్ట్స్ అకాడమీలో కనీసవసతులు కల్పించకపోవడంపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఔత్సాహిక అథ్లెట్ల కోసం ఇండోర్ స్టేడియం నిర్మించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచిపని చేశావంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.