: ప్రజల జీవితాలతో ఆడుకోవాల‌ని చూస్తే, వారే మీ జీవితాల‌తో ఆడుకుంటారు: వైసీపీ సభ్యులకు చ‌ంద్ర‌బాబు హితవు


రాష్ట్రానికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు అందిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపే అంశంపై ప్రవేశ‌పెట్టిన తీర్మానంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ప్రసంగం ముగిసింది. ఆ తర్వాత కూడా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ స‌భ్యుల‌పై మండిప‌డ్డారు. అన్నింటిపై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తూ న‌ష్టం క‌లిగిస్తూ ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకోకూడ‌ద‌ని అన్నారు.

‘మీకు భ‌గ‌వంతుడు నోరిచ్చాడు.. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి.. కాదు దుర్వినియోగం చేసుకుంటామంటే మీకే న‌ష్టం. మీరు ఒక‌టి అంటే మేము 100 అన‌గ‌లం... అలా వ‌ద్ద‌ని మా వాళ్ల‌కు చెప్పాను. బావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం మీరు తిట్టిన తిట్ల ప‌ట్ల మ‌ళ్లీ స్పందించ‌కుండా సంయ‌మ‌నం పాటిస్తున్నాం. ఇష్ట‌ప్ర‌కారం మాట్లాడ‌కూడ‌దు. మీకు స‌భ్య‌త లేదు, సంస్కారం లేదు... రాజ్యాంగానికి లోబ‌డి న‌డుచుకోవాలి. మీకు హుందాత‌నం లేదు.. రాజ్యాంగం అంటే న‌మ్మ‌కం లేదు.. మీరు ప్రజల జీవితాలతో ఆడుకోవాల‌ని చూస్తే వారే మీ జీవితాల‌తో ఆడుకుంటారు’ అని చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు.

 అనంత‌రం ఈ రోజు ఒక శుభ‌దినం అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. తాము ప‌డ్డ‌క‌ష్టానికి ఫ‌లితం వ‌చ్చింద‌ని అన్నారు. ఈ రోజు త‌నకు ఎంతో గ‌ర్వంగా ఉందని అన్నారు. ఎందుకంటే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌ని ఒక్క‌రోజు ఆగిపోతే 30 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌స్తుంద‌ని అన్నారు. ఆ ప‌నులు ఆగిపోకుండా ఎంతో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని అన్నారు. లేదంటే ఎంతో న‌ష్టం వ‌స్తుందని చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చి నాబార్డు ద్వారా పోల‌వ‌రంకి నిధులు అందిస్తుంద‌ని చెప్పారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విష‌య‌మ‌ని అన్నారు. తాను అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని అందరూ సమర్థించాలని కోరారు. 

  • Loading...

More Telugu News