: బేబీకి పాలు కావాలంటూ రైలు ప్రయాణికురాలి ట్వీట్... సమకూర్చిన రైల్వే
ఈ ఏడాది మార్చి 12న... ఓ జంట రైలులో ప్రయాణిస్తోంది. వారి వెంట ఆరు నెలలు (సుమారు) వయసున్న కార్తీకి అనే బాబు కూడా ఉన్నాడు. పాలు కోసం బాబు తెగ ఏడ్చేస్తున్నాడు. కానీ, ఎక్కడ చూసినా రైలులో పాలు లభించే పరిస్థితి కనిపించలేదు. అదే రైలులో ప్రయాణిస్తున్న అనఘానికమ్ అనే మహిళ ఈ విషయాన్ని ట్విట్టర్ లో కొంకణ్ రైల్వే విభాగానికి ట్వీట్ చేసింది.
బాబు ఫొటోను పోస్ట్ చేసి ‘‘ఈ బేబీకి పాలు కావాలి. బేబీ తల్లిదండ్రులతో కలసి కొంకణ్ రైల్వే పరిధిలో హప్పా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తోంది’’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి కొంకణ్ రైల్వే వెంటనే స్పందించింది. ప్రయాణికుల పీఎన్ఆర్ వివరాలు, టికెట్ వివరాలను పంపాలని కోరింది. అనఘా నికమ్ టికెట్ ఫొటో తీసి మరీ పోస్ట్ చేసింది. దాంతో ‘‘కోలాడ్ రైల్వే స్టేషన్ లో బేబీ కోసం పాలను సమకూర్చడం జరిగింది. రైలు ఆగినప్పుడు కోచ్ నుంచి బయటకు రాగలరు’’ అని కొంకణ్ రైల్వే బదులిచ్చింది. కొంకణ్ రైల్వే స్పందనకు అనఘానికమ్ ముగ్ధురాలు అయి అభినందనలు తెలియజేసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చాలా గొప్పగా పని చేస్తున్నారని కొనియాడింది.