: పిల్లలు నోరు పారేసుకుంటే వారిని ఇంటి నుంచి గెంటేయవచ్చు...!: ఢిల్లీ హైకోర్టు తీర్పు
ఢిల్లీ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. పిల్లలు పెద్దవారిని తిడితే తల్లిదండ్రులు వారిని భరించాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచి బయటకు పంపించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కుమార్తె అయినా ఇదే వర్తిస్తుందని పేర్కొంది. సదరు తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు వారి సొంతది కాకపోయినా ఈ హక్కు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ, సీనియర్ సిటిజన్స్ చట్టం 2007లోని నిబంధనలను ఉటంకిస్తూ జస్టిస్ మన్మోహన్ ఈ విధంగా తీర్పు ఇచ్చారు.
వృద్ధులు ప్రశాంతంగా వారి ఇంట్లో జీవించేందుకు, తమను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న కుమారుడితో కలసి ఉండే ఒత్తిడి చేయకుండా చూసేందుకు ఎవిక్షన్ ఆర్డర్ (పిల్లల్ని బయటకు పంపాలంటూ ఆదేశాలు) జారీ చేయవవ్చని జస్టిస్ మన్మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు చట్టంలో తగిన మార్పులు చేయాలని, అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. సుహృద్భావ సంబంధాలు ఉన్నంత వరకు, కుమారుడు భారం కానంతవరకూ తమతో కలసి ఉండేందుకు తల్లిదండ్రులు అనుమతించవచ్చని ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు పేర్కొంది.