: మేం అధికారంలోకి వస్తే చంద్రబాబును కూడా మాట్లాడకుండా అడ్డుకుంటాం: జగన్
ఏపీ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అధికారపక్షంపై ప్రతిపక్ష నాయకుడు జగన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పాలని, మాట్లాడటాన్ని తొందరగా ముగించాలంటూ జగన్ కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుమార్లు సూచించారు. స్పీకర్ పదేపదే తన ప్రసంగానికి అడ్డుతగులుతుండటంతో, జగన్ సహనం కోల్పోయారు. అధ్యక్షా, రేపొద్దున మా స్థానంలోకి చంద్రబాబు వచ్చినప్పుడు... తాము కూడా ఆయనను మాట్లాడకుండా ఇదే విధంగా అడ్డుకుంటామని ఆగ్రహంతో ఊగిపోయారు. మాట్లాడేందుకు తనకు ఇచ్చిన సమయం ఇంకా పూర్తికాకుండానే... తనకు ఇలా అడ్డు తగలడం సరైంది కాదని జగన్ అన్నారు.