: కమలహాసన్ కు రాజకీయ ఇబ్బందులు తలెత్తితే అండగా నిలబడతాం: హీరో విశాల్
అగ్నిపరీక్ష పేరుతో ఓ ప్రముఖ తమిళ చానల్ కు విలక్షణ నటుడు కమలహాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూ రాజకీయపరంగా సంచలనం రేపింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఈ ఇంటర్వ్యూలో కమల్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి ఆగ్రహం తెప్పించాయి. అంతేకాదు, కమల్ పై పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 65 ఏళ్ల తర్వాత కమల్ కు జ్ఞానోదయం అయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న యంగ్ హీరో విశాల్ ఈ వ్యవహారంపై స్పందించాడు. రాజకీయపరంగా కమలహాసన్ కు ఎలాంటి సమస్యలు తలెత్తినా తాము ఆయనకు అండగా నిలబడతామని తెలిపాడు. కమల్ కు తాము పూర్తి మద్దతు పలుకుతున్నామని చెప్పాడు.