: తిట్టొద్దని అనను...ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు: విరాట్ కోహ్లీ
మైదానంలో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడవద్దంటూ ప్లకార్డు పట్టుకుని కూర్చోలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు అంశాలపై కోహ్లీ రాంచీలో మాట్లాడాడు. దాని వివరాల్లోకి వెళ్తే... బెంగళూరు టెస్టులో రేగిన వివాదంపై ఇంకా చర్చించడం సముచితం కాదని అన్నాడు. రేపు టెస్టులో ఆడాల్సినదానిని వదిలేసి, జరిగిపోయిన అంశం గురించి రచ్చచేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పాడు. బెంగళూరు వివాదం ముగిసిపోయిన అధ్యాయమని చెప్పాడు. అయితే బెంగళూరు టెస్టులో డీఆర్ఎస్ నిర్ణయం కోసం డ్రెస్సింగ్ రూం వైపు చూసిన స్మిత్ పై తాను చేసిన వ్యాఖ్యల గురించి ఆలోచించానని చెప్పాడు. వాటిపై చింతించడం లేదని అన్నాడు.
గతంలో వివాదాలు ఏర్పడినప్పుడు సామరస్యం దెబ్బతినకుండా తీసుకున్న చర్యలు తమకు కూడా తెలుసని కోహ్లీ చెప్పాడు. ఇది రాంచీ టెస్టు గురించి ఆలోచించాల్సిన సమయమని కోహ్లీ తెలిపాడు. తన వ్యవహార శైలి గురించి చర్చించడం ఇది తొలిసారి కాదని అన్నాడు. బాగా ఆడినంతకాలం ఇలాంటి చర్చలు ఎన్ని జరిగినా ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరికీ సొంత వ్యక్తిత్వం ఉంటుందని, తాను ఎవరినీ సవాల్ చేయడం లేదని, అదే సమయంలో తనను ఎవరూ సవాల్ చేయకూడదని చెప్పలేనని చెప్పాడు. ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు నడుస్తారని కోహ్లీ తెలిపాడు.