: మణిపూర్ రాష్ట్రంలో కొలువుదీరిన బీజేపీ సర్కారు... సీఎంగా బిరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ సర్కారు కొలువు దీరింది. ఈ రోజు మధ్యాహ్నం ఇంఫాల్ లోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎన్.బిరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. జాయ్ కుమార్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈయన ఎన్పీపీ పార్టీనేత. మణిపూర్ మాజీ డీజీపీ. అలాగే విశ్వజీత్ సింగ్, జయంత్ కుమార్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ నజ్మాహెప్తుల్లా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ హాజరు కాలేదు. వీరు బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న మణిపూర్ లో బీజేపీకి కేవలం 21 స్థానాలు రాగా, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ మిగిలిన పార్టీల మద్దతు సంపాదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. మిగిలిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయం సాధించి మణిపూర్ నూ తన ఖాతాలో చేర్చుకుంది.