: సంగారెడ్డిలో త్వరలో జనసేన సభ.. చర్చనీయాంశంగా మారిన పవన్ నిర్ణయం
నిన్న మీడియా సమావేశంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు తెలుగురాష్ట్రాల్లోనూ పోటీచేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, తెలంగాణలోని సంగారెడ్డిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సభను కూడా నిర్వహిస్తామని పవన్ చేసిన ప్రకటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలుసార్లు పవన్ ను కలసి, చర్చించిన విషయం తెలిసిందే. అంతేగాక, పవన్ కల్యాణ్ తాను నిర్వహించిన పలు సభల్లో జగ్గారెడ్డి పేరును కూడా పలుసార్లు ప్రస్తావించారు.
ఇక తాను ఏపీలో అనంతపురం నుంచి పోటీకి దిగుతానని ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంనుంచే తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతుతో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా పవన్ తెలంగాణలోనూ పార్టీ బలాన్ని పెంచుకోనున్నారని టాక్. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన పవన్ కల్యాణ్ షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రజలు భారీ ఎత్తున వచ్చి పవన్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. ఆ జిల్లా కేంద్రంగానే తెలంగాణలో పవన్ తమ పార్టీని బలపర్చుకుంటారని అంతా భావిస్తున్నారు.