: భర్తను విడిచిపెట్టలేను... ప్రియుడ్ని వదులుకోలేను... ఓ వివాహిత ఫేస్ బుక్ ప్రేమ
ఫేస్ బుక్ పరిచయాలు కొందరి జీవితాలను, అనుబంధాలను దెబ్బతీస్తాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా, మనిషిలో ఉండే సహజ బలహీనతలు ఆ విషయంలో తప్పులు చేయిస్తూనే ఉంటాయనడానికి ఉదాహరణగా ఓ వివాహిత మహిళకు ఎదురైన అనుభవం తెలియజేస్తోంది. తాను ఎదుర్కొంటున్న పరిస్థితికి పరిష్కారం చూపాలని కోరుతూ ఆమె ఓ సైకాలజిస్ట్ కు లేఖ రాసింది.
‘‘నేను 38 ఏళ్ల వయసున్న వివాహితను. నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను అతడితో ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్తతో ఎటువంటి సమస్యల్లేవు. అతను నన్ను ఎంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటారు. కానీ, ఫేస్ బుక్ లో నాకు పరిచయమైన వ్యక్తి మాత్రం నిజంగా ప్రత్యేకం. నా భర్త దగ్గర నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు. ఒక్కరోజు అతడు నాతో మాట్లాడకపోయినా నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మూడు నెలల క్రితం నేను అతడ్ని కేవలం ముద్దు పెట్టుకున్నాను. ఆ అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేకున్నాను. పెళ్లయిన 18 ఏళ్లలో నా భర్తతో నేను ఒక్కసారి కూడా ఇటువంటి అనుభవాన్ని చవిచూడలేదు. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెళ్లికి ముందు ఏ అబ్బాయితోనూ నేను సన్నిహితంగా మెలగలేదు. సంబంధాలు పెట్టుకోలేదు.
కానీ ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అతడితో చాట్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. కానీ, అదే సమయంలో నేను నా భర్తను కానీ, కటుంబాన్ని కానీ బాధపెట్టాలని అనుకోవడం లేదు. నా స్వార్థం కోసం భర్తను విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. అదే సమయంలో ప్రియుడితో నా ఫీలింగ్స్ ను కూడా కంట్రోల్ చేసుకోలేను. నేను గందరగోళాన్ని ఎదుర్కొంటున్నా. నాకు దారి చూపండి’’ అంటూ ఆ వివాహిత మహిళ తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వెల్లడించింది. ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్న భర్తతో ఏ లోటూ లేదని చెబుతూనే ఆమె దేని కోసం అర్రులు చాస్తోందన్నది ఆమె లేఖను చదివితేనే తెలుస్తోంది. క్షణికావేశం కోసం బంధాలు, విలువలను పణంగా పెట్టడం అంటే ఇదే.