: స్థూల జాతీయోత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాం: అమరావతిలో తొలిబడ్జెట్ ప్రసంగంలో యనమల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 192 రోజుల్లోనే నూతన శాసనసభ భవనం నిర్మించుకోగలిగామని అన్నారు. రాష్ట్రం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుందని చెప్పారు. శక్తి, ఇంధన, సులభతర వాణిజ్యంలో రాష్ట్రం పురస్కారాలు అందుకుందని వివరించారు. మన రాజధాని నగరం దేశానికే ఆదర్శనమూనాగా నిలబడనుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో అన్ని అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రెండున్నరేళ్లలో ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కుని అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు.
ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయని యనమల చెప్పారు. జీఎస్‌టీ వల్ల రాబోయే కాలంలో రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. కృష్ణా పుష్కరాల ద్వారా మరోసారి మన సంస్కృతిని చాటామని చెప్పారు. భారతీయ సైన్స్ కాలేజ్ నిర్వహించిన పద్ధతి అందరినీ ఆకర్షించిందని అన్నారు. జాతీయ మహిళా సాధికారత సదస్సు అద్భుతంగా నిర్వహించామని అన్నారు. అమరావతిని ఓ పర్యాటక నగరంగా కూడా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తాము ముందుకు వెళుతున్నామని అన్నారు.