: దేశంలో తగ్గిపోతున్న హిందువుల జనాభా.. వెల్లడించిన కేంద్రం
దేశంలో హిందువుల జనాభా మామూలుగా పెరుగుతున్నా మొత్తం జనాభా పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోందని కేంద్రం పేర్కొంది. గత నాలుగు దశాబ్దాల కాలంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం పరంగా చూసినప్పుడు మాత్రం మూడుశాతం తగ్గినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ జి.అహిర్ లోక్‌సభకు తెలిపారు. 1971లో 82.7 శాతం ఉన్న హిందూ జనాభా 2011 నాటికి 79.8 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 45.33 కోట్లుగా ఉన్న హిందువుల సంఖ్య 2011 నాటికి 96.62 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి వివరించారు. కాగా, 1971 గణాంకాల్లో సిక్కిం జనాభాను మినహాయించామని, 1981లో అస్సాం, 1991లో జమ్ముకశ్మీర్, 2001లో మణిపూర్ సేనాపతి జిల్లాలోని మావోమారం, పావోమట, పురుల్ సబ్ డివిజన్లలో జనాభాను పరిగణనలోకి తీసుకోలేదని, ఆయా సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో జనాభా లెక్కలు సేకరించలేదని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు.