: బ్యాంకులకు షాకిస్తున్న ఖాతాదారులు.. పోస్టాఫీసుల ముందు పెరుగుతున్న క్యూలు


నోట్ల రద్దు తర్వాత నిబంధనలు, ఆంక్షల పేరిట ఖాతాదారులను ఆటాడుకున్న బ్యాంకులకు ఇప్పుడు ఖాతాదారులు షాకిస్తున్నారు. రోజుకొకటి చొప్పున ఆంక్షలు విధిస్తూ వినియోగదారులు బ్యాంకులవైపు చూడాలంటేనే భయపడేలా చేసిన బ్యాంకులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు తమ దృష్టిని పోస్టాఫీసు ఖాతాల వైపు మళ్లించారు. వంద రూపాయలకే ఖాతా తెరిచే వీలుండడం, ఖాతాలో కనీస మొత్తం ఆంక్షలు లేకపోవడం, గరిష్టంగా ఎంతైనా జమచేసుకునే వీలుండడంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. సికింద్రాబాద్, అబిడ్స్, ఖైరతాబాద్ పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు.

తొలుత ఖాతా తెరిచేందుకు కేవైసీ నియమాలను పాటించాలని, డబ్బు జమను బట్టి పాన్, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పోస్టల్ అధికారులు తెలిపారు. ఖాతా తెరిచిన అనంతరం 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చు. పెద్ద నగరాల్లో అయితే పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 5 లక్షలకు పైగా సేవింగ్ అకౌంట్లు ఉన్నాయని, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఖాతాలు తెరిచినట్టు పోస్టల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News