: రాజకీయాల్లోకి నటి గౌతమి.. ఆర్కేనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి?
జయ మరణంపై అనుమానాలున్నాయంటూ ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించిన నటి గౌతమి రాజకీయాల్లోకి రానున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జయ మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా రేపటి (16వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కపార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొనగా అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక జయ మేనకోడలు దీప స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ ఊగిసలాడుతోంది.
మరోవైపు జయ మృతిపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు న్యాయవిచారణకు ఆదేశించాలని గౌతమి డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ విషయంలో పలుమార్లు విమర్శలు గుప్పించిన ఆమె ప్రధానిని సైతం నేరుగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ఉప ఎన్నికలో బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కమలనాథులు ఆమె పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సాధించిన విజయం ప్రభావం తమిళనాడుపైనా పడుతుందని, దాంతోపాటు సినీ గ్లామర్ కూడా కొంతమేరకు పనిచేస్తుందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గౌతమి అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.