: ప్రతి రూపాయి విలువైనది... ఆడంబరాలు వద్దు: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో అట్టహాసాలు మంచిది కాదని అన్నారు. రాజ్ భవన్ లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించాలని ఆయన సూచించారు.
మనం ప్రతీ రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సమయంలో వృథా ఖర్చులు సరికాదని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తాను ప్రతి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. ఆ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వూరేగింపులు, బాణాసంచా కాల్పులు వద్దని ఆయన సూచించారు. పంజాబ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన కోరారు.