: పాకిస్థాన్ లో 23 దేశాల ప్రతినిధుల భారీ సమావేశం...యూరోపియన్ యూనియన్ లాంటి సమూహంపై చర్చ!
యూరోపియన్ యూనియన్ లాంటి యూనియన్ ను ఏర్పాటు చేయాలన్న ఆసియా దేశాల ఆలోచనలకు పాకిస్థాన్ లో సమాలోచనలు జరిగాయి. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన సమావేశానికి ఆసియాలోని 23 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. పాకిస్థాన్ తో భద్రతాపరమైన సమస్యలున్నప్పటికీ భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలు కూడా తమ ప్రతినిధులను పంపడం విశేషం.
ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి పాక్ పార్లమెంటు ఎగువ సభ చైర్మన్ రాజా రబ్బాని మాట్లాడుతూ, తాము కలలు కంటున్న ఆసియన్ యూనియన్ పాశ్చాత్య దేశాల యూనియన్ మాదిరిగా పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కుకోకుండా చూడాలని సూచించారు. ఆసియా గమ్యం అదే కావాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలోని వివిధ దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతుండడంతో ఆసియన్ బ్లాక్ కూడా యూరోపియన్ యూనియన్ లా రిమోట్ గా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ భేటీలో ‘ఆసియన్ పార్లమెంటరీ అసెంబ్లీ’ ఏర్పాటును ప్రతిపాదించవచ్చని పార్లమెంట్ అధికార ప్రతినిధి రంజాన్ సాజిద్ తెలిపారు.