: జగన్ కు, నాకు ఉన్న తేడా ఏమిటో ప్రజలు ఈ రోజు గమనించారు: చంద్రబాబునాయుడు
జగన్ కు, తనకు ఉన్న తేడా ఏమిటో ఈ రోజు ప్రజలు గమనించారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం, మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘జగన్ కు, నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయాన్ని జగనే చెప్పాడు. ఆ తేడా ఏమిటో ప్రజలు ఈ రోజు గమనించారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని గవర్నర్ ను కలిసి అడ్డుకున్నవారే, ఆయనకు మంత్రి పదవి దక్కక క్షోభతో చనిపోయారని విమర్శిస్తున్నారు. నాగిరెడ్డిని క్షోభకు గురి చేసింది జగన్ కాదా? సాటి జీవి చనిపోతే పక్షులు, పశువులు సైతం తమ సానుభూతి చూపుతాయి, కానీ, జగన్ మాత్రం సాటి మనిషిపై సానుభూతి చూపలేకపోయారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియను మేము సభకు పిలవలేదు, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందున బాధ్యతగా ఆమె వచ్చారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.