: సుప్రీంకోర్టులో గోవా కాంగ్రెస్ కు షాక్... అంత బలం ఉంటే గవర్నర్ ను ఎందుకు కలవలేదని ప్రశ్న
గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని, తమ పార్టీ బలం నిరూపించుకోలేని పక్షంలోనే బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు పిలవాలని కోరుతూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదిస్తూ బీజేపీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని అన్నారు. గోవా సీఎంగా పారికర్‌ను ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. అయితే, రాష్ట్రంలో గవర్నమెంటు ఏర్పాటుకు కాంగ్రెస్‌కి బలం ఎక్కడుంది? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక వేళ కాంగ్రెస్ కు బలం ఉంటే మరి గవర్నర్‌ను ఎందుకు సంప్రదించలేదని అడిగింది. గవర్నర్‌ను ఇప్పుడయినా కలవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 1.30కు గోవా గవర్నర్‌ను కలవాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు.