: రూపాయికి మోదీ బూస్ట్... 52 వారాల గరిష్ఠానికి విలువ... రూ. 1.31 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు


ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం ప్రభావం నేడు స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్స్ మార్కెట్ పైనా కనిపించింది. రూపాయికి ఒక్కసారిగా విలువ పెరిగింది. డాలర్ తో పోలిస్తే, ఏకంగా 43 పైసలు లాభపడింది. శుక్రవారం నాటి ముగింపు రూ. 66.60తో పోలిస్తే, ఈ ఉదయం రూ. 66.17 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ ఈ స్థాయికి పెరగడం గత ఏడాది వ్యవధిలో ఇదే తొలిసారి. నోట్ల రద్దు తరువాత మార్కెట్ వర్గాల్లో ఉన్న అనిశ్చితికి మోదీ ఈ ఎన్నికల ఫలితాలతో తెరదించారని బ్రోకరేజ్ సంస్థ మెక్వయిర్ అభిప్రాయపడింది. దీర్ఘకాలం పాటు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారని చెప్పారు.

కాగా, నేటి స్టాక్ మార్కెట్ తన లాభాలను మరింతగా పెంచుకుంది. ఉదయం 11:10 గంటల సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరిగి 29,450 పాయింట్లకు చేరింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1.31 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 1,18,70,631 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఇకపై నిఫ్టీ కొత్త రేంజ్ ని ఏర్పాటు చేసుకున్నట్టుగా భావించవచ్చని, 9,100 నుంచి 9,500 మధ్య నిఫ్టీ కదలికలు ఉంటాయని భావిస్తున్నామని హెచ్ఆర్బీవీ క్లయింట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఎస్ హరిహర్ అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో 9,100 పాయింట్ల వద్ద ఉన్న సాంకేతిక నిరోధాన్ని నిఫ్టీ అధిగమిస్తే, 10,350 వరకూ వెళ్లవచ్చని బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది.

  • Loading...

More Telugu News