: భారీ హిమపాతం: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ... ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు


గత వారాంతం నుంచి అమెరికాలో కురుస్తున్న మంచుకు జనజీవనం అస్తవ్యస్తం కాగా, పలురాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల నుంచి విపరీతంగా మంచు పడుతూ ఉండటంతో ఫిలడెల్ఫియా, విస్కాన్సిస్, న్యూజర్సీ, పెనస్లేవియా, న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రోడ్లపై మూడు అడుగుల ఎత్తుకు మంచు పేరుకు పోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి అత్యధిక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించామని అధికారులు తెలిపారు.

నేటి నుంచి స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవని, తిరిగి సాధారణ పరిస్థితి ఏర్పడేంత వరకూ సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులతో పాటు సైన్యం, విపత్తు నిర్వహణా విభాగం సంయుక్తంగా మంచును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కాగా, విస్కాన్సిస్ రాష్ట్రంలోని మిల్వౌకీ కౌంటీ, కెనోషా, వౌవాటోసా, సెయింట్ ఫ్రాన్సిస్, వెస్ట్ అల్లీస్, జెర్మన్‌టౌన్, ప్లీజంట్ ప్రైరీ, సౌక్విల్లీ, న్యూబర్గ్ ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉన్నట్టు తెలుస్తోంది. న్యూజెర్సీలో అత్యయిక స్థితిని ప్రకటించినట్టు రాష్ట్ర గవర్నర్ క్రిస్ క్రిష్టీ తెలిపారు. పెన్సిల్వేనియాలోని హరీస్‌ బర్గ్ ప్రాంతం కూడా మంచుతో కూరుకుపోయింది. మేరీలాండ్, న్యూయార్క్ నగరాల్లో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.

  • Loading...

More Telugu News