: జగన్ జైల్లో ఉండగా, భూమా ఏం చేశారో నాకు ఒక్కడికే తెలుసు!: భూమా బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి
తన బావ, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మృతి తరువాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన మేలును మరిచిపోయి, దుర్మార్గంగా ప్రవర్తించిందని, దివంగత శోభా నాగిరెడ్డి అన్న ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్న వేళ, ఆ పార్టీకి, జగన్ కుటుంబానికి భూమా ఎంతో అండగా నిలిచారని అన్నారు. ఓ తమ్ముడిలా విజయమ్మకు తోడుగా భూమా నిలిచారని చెప్పారు.
జగన్ కుటుంబానికి భూమా ఏం చేశారో తనకు మాత్రమే తెలుసునని, ఇప్పుడు దాన్ని వైకాపా నేత జగన్ మరచిపోయారని విమర్శించారు. ఆనాడు శోభా నాగిరెడ్డి కూడా విజయమ్మ తరఫున ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మరణించారని, వైకాపా కోసం భూమా తన భార్యను కోల్పోయారని అన్నారు. అంత చేసిన భూమా చనిపోతే, సంతాపం చెప్పేందుకు కూడా వారు రాలేదని, వారు ఇంత దిగజారుతారని తాను అనుకోలేదని చెప్పారు. ఓ మేనమామగా అఖిలప్రియను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతానని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.