: భూమాపై అసెంబ్లీ బయట స్పందించిన వైకాపా... చంద్రబాబు మానసిక ఆవేదనకు గురి చేశారని విమర్శలు
వైకాపాలో ఉన్నంత కాలం భూమా నాగిరెడ్డి కుటుంబానికి తామెంతో గౌరవం ఇచ్చామని, ఆయన మరణం తమకూ లోటేనని వైకాపా విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సంతాప తీర్మాన సభను వైకాపా బహిష్కరించిన తరువాత, అసెంబ్లీ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వద్ద ఉన్న అతిపెద్ద పదవి అయిన పీఏసీ చైర్మన్ గా ఆయన్నే నియమించామని గుర్తు చేశారు. చంద్రబాబు ఆయన్ను ఎంతో మానసిక ఆవేదనకు గురి చేశారని ఆరోపించిన పిన్నెల్లి, మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించి, ఆయన్ను తమ పార్టీలోకి లాక్కున్నారని, ఆపై పదవి ఇవ్వలేదని అన్నారు. అనవసరంగా వైకాపాకు దూరమయ్యానని ఆయనెంతో బాధపడ్డారని అన్నారు. ఆయన మరణానికి కారణమైన వారితో కలసి సంతాపం తెలపడం ఇష్టం లేకనే సభకు వెళ్లలేదని, ఆయనంటే ఇప్పటికీ తమకెంతో గౌరవమని చెప్పారు.