: ‘గాలికి’ పెద్ద ఊరట.. రూ.884 కోట్ల ఆస్తుల జప్తు ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు


కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆస్తుల స్వాధీనం విషయంలో ఈడీ ఆదేశాలు చెల్లవని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. జనార్దనరెడ్డి, ఆయన సతీమణి అరుణాలక్ష్మిలపై ఈడీ దాఖలు చేసిన కేసును సోమవారం కోర్టు కొట్టివేసింది. 2011లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జనార్దనరెడ్డికి చెందిన గనుల సంస్థ, బ్రాహ్మణి ఉక్కు, ఆయన ఇల్లు, హెలికాప్టర్లను జప్తుచేసింది. వీటి మొత్తం విలువ రూ.884 కోట్లుగా పేర్కొంది. 2004-06 మధ్య కాలంలో జనార్దన్‌రెడ్డి ఈ ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనేది ఈడీ అభియోగం. అయితే 2009లో కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(పీఎంఎల్) చట్టానికి సవరణలు చేసిందని, కాబట్టి అంతకుముందున్న నిబంధనల ప్రకారం ఈడీ ఆదేశాలు చెల్లవంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుబ్రతో కమల్ ముఖర్జీతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News