: రెండు దశాబ్దాల తర్వాత పాక్‌లో జనాభా లెక్కలకు శ్రీకారం!
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించనుంది. రెండు లక్షల మంది సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సైనిక దళ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసీఫ్ గఫూర్, సమాచారశాఖా మంత్రి మరియం ఔరంగజేబ్‌లు ప్రకటించారు. రెండు దశల్లో జనాభా లెక్కల కార్యక్రమాన్ని నిర్వహించి మే 25 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు.
జానాభా లెక్కల సేకరణకు సిబ్బందితోపాటు రక్షణగా ఓ సైనికుడు కూడా వారి వెంట ఉంటాడని పేర్కొన్నారు. అలాగే సిబ్బంది సేకరించే డేటాను కూడా సైనికులు మరోసారి పరిశీలిస్తారని వివరించారు. 19 ఏళ్ల తర్వాత చేపట్టనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే 1,18,918 మంది పౌర సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చినట్టు మంత్రి మరియం తెలిపారు. మొదటి దశ బుధవారం (15న) ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుందని, రెండో దశ ఏప్రిల్ 25న మొదలై మే 25న ముగుస్తుందని పేర్కొన్నారు. కాగా, 1998లో పాక్‌లో చివరి సారిగా జనాభాను గణించారు. అప్పటి లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా 180 మిలియన్లు.