: కమలహాసన్ కంటున్న కలలు కేవలం సినిమాలకే పరిమితం: అన్నాడీఎంకే పార్టీ ఎద్దేవా
జయలలిత మృతిచెందిన తరువాత తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీనటుడు కమల హాసన్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర అధికార అన్నాడీఎకేం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సర్కారు మారుతుందని కమల హాసన్ కలలు కంటున్నారని విమర్శించింది. అలాంటి కలలు కనడం ఆయన మానుకోవాలని ఎద్దేవా చేసింది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి వైగాయిచెలవన్ మాట్లాడుతూ.. కమల్ ఒక సినీనటుడని, ఆయన కంటున్న కలలు కేవలం సినిమాలకే పరిమితమని అన్నారు. కమల్ ఎన్నికలు జరుగుతాయంటూ కంటున్న కలలు నిజంకావని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ సర్కారు ప్రజల సంక్షేమం కోసం విజయవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అలాగే వచ్చేనెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు.