: ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా స్పిన్నర్
కొన్ని రోజుల క్రితమే ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్‌లో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్... టెస్టుల్లో రవీంద్ర జడేజాతో కలిసి ఉమ్మడిగా తొలి స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకులను ప్రకటించగా అందులోనూ అశ్విన్ సత్తాచాటి అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలిమ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించినప్పటికీ ఆయన బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో నిన్నటి వరకు ఐసీసీ నెం.1 ర్యాంక్ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ దగ్గర ఉంది. అయితే, ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టులో షకిబ్ మూడు వికెట్లు మత్రమే పడగొట్టి 31 పరుగులు చేశాడు. మరోవైపు బెంగళూరు టెస్టులో 8 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో మొత్తం 15 వికెట్లతో రాణించిన అశ్విన్ నెం.1 ర్యాంక్‌ని మళ్లీ సంపాదించుకున్నాడు. దీంతో షకిబ్ రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం అశ్విన్ 434 పాయింట్లతో, షకిబ్ 403 పాయింట్లతో మొదటి, రెండో స్థానంలో ఉన్నారు.