: ముందు రాజీనామా చేయండి.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచించండి!: మణిపూర్ సీఎంకు గవర్నర్ సూచన


మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టేందుకు పావులు కదుపుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఓక్రమ్ ఇబోబి సింగ్ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కోరారు. కాగా ఇబోబీ డిమాండ్ ను గవర్నర్ తోసిపుచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి ఓక్రామ్ రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరదని... ముందు పదవికి రాజీనామా చేస్తే.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఓక్రామ్ కు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది.

మణిపూర్ లో ఇటీవల 60 స్థానాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలను గెలుచుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఇతర పార్టీలపై కాంగ్రెస్, బీజేపీలు ఆధారపడ్డాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మరో ముగ్గురు అభ్యర్థుల మద్దతు అవసరం. బీజేపీ 10 మంది అభ్యర్థుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.

కాగా, 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇబోబీ కోరారు. బీజేపీయేతర, ఎన్‌పీఎఫ్‌యేతర ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన కోరారు. కాగా బీజేపీ తన 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎల్జేపీ, టీెంసీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు గవర్నర్  నజ్మాహెప్తుల్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓక్రామ్ ఇబోబీ పదవికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News