: బీజేపీ ఎత్తుగడకు.. అర్ధరాత్రి గవర్నర్ వద్దకు పరుగులు తీసిన మణిపూర్ ముఖ్యమంత్రి
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ కదులుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మణిపూర్ లో సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. నిన్న రాత్రి 32 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ముందు బీజేపీ పరేడ్ నిర్వహించింది.
దీంతో మణిపూర్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తామే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే భావనలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ కు షాక్ తగిలింది. బీజేపీకి మద్దతు ప్రకటించిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆండ్రో శ్యామ్ కుమార్ కూడా ఉండటంతో ఆయన షాక్ కు గురయ్యారు. దీంతో, అర్ధరాత్రి పూట హుటాహుటీన రాజ్ భవన్ కు పరుగులు తీశారు. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తమను ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని గవర్నర్ ను కోరారు.
మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31. ఎన్నికల్లో కాంగ్రెస్ కు 28, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. టీఎంసీకి ఒక్క స్థానం దక్కగా, 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. మారిన పరిణామాల నేపథ్యంలో, మణిపూర్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.