: ఇంట్లో నుంచి పారిపోయిన ఇద్దరమ్మాయిలు.. చర్చిలో రెండోసారి పెళ్లి చేసుకున్న వైనం!
ఆ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కలిసిమెలసి పెరిగారు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అనంతరం వేరు వేరు కాలేజీల్లో చేరినప్పటికీ వారి మధ్య విడదీయరాని స్నేహం మాత్రం కొనసాగింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. వారి స్నేహాన్ని చూసి వారి ఊరంతా ముచ్చటపడేది. అయితే, వారిరువురికీ పెళ్లీడు రావడంతో ఇక వారిద్దరూ విడిపోవాల్సిందే అని అనుకున్నారేమో.. ఆ ఊహను కూడా తట్టుకోలేకపోయిన వారు ఆడపిల్లలయినా ఒకరినొకరు పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. చివరికి పెళ్లి చేసుకొని తమ ఇళ్లకు వెళ్లారు. ఈ విషయంపై ఆగ్రహించిన వారి వారి తల్లిదండ్రులు వారిరువురినీ వారి వారి ఇళ్లలోంచి బయటకు రానివ్వలేదు, కలుసుకోనివ్వలేదు. అయితే, ఎట్టకేలకు ఇంట్లో నుంచి తప్పించుకుని పారిపోయిన వారు ఓ చర్చిలో కలుసుకొని మరోసారి పెళ్లిచేసుకున్నారు.
చర్చికి వెళ్లి వస్తామని చెప్పి, ఇంట్లోంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రావడంతో వారి వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పారిపోయి పెళ్లిచేసుకున్న ఈ యువతుల పేర్లు మాలిని, వరుణ అని పోలీసులు తెలిపారు. వారిద్దరూ సహజీవనం చేయాలని అనుకుని, ఆ విషయాన్ని తమ ఇంట్లో చెప్పారని అన్నారు. అందుకు కుటుంబసభ్యులు వ్యతిరేకించడంతో పారిపోయారని చెప్పారు.