: ఆ ఇంటర్వ్యూ చదివి, రాంగోపాల్ వర్మ ఏడ్చేశాడట!
తాను ఏ రకమైన భావోద్వేగాలూ లేని వ్యక్తినని, అయితే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చదివి కన్నీరు పెట్టుకున్నానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఆయన సర్కార్ సిరీస్‌లో ‘సర్కార్-3’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌ను ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ ఇంటర్వ్యూ చేశారు. రాం గోపాల్ వర్మ చేసే సినిమాలన్నీ స్థిరత్వంగా ఉండవని, అటువంటి దర్శకుడితో కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయాలేంటి? అని ఆయన అమితాబ్ ను ఆ ఇంటర్వ్యూలో అడిగారు. ఆ ప్రశ్నకు అమితాబ్ సమాధానమిస్తూ.. స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే కానీ, ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తాయని చెప్పారు.
ఉదాహరణకు నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులో ఉన్న అందాన్ని ఎలా గుర్తించగలుగుతారని అమితాబ్ అడిగారు. అలా ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారు. అలాగే రాంగోపాల్ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వమని ప్రశంసించారు. ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వర్మ అని ఆయన అన్నారు. తనలో కూడా అలాంటి కోణాన్ని చూడాలనుకోవడం తన అదృష్టమని చెప్పారు. వర్మ అస్థిరత్వం వల్ల అతను అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ, ఓ కళాకారుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్థిరంగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంటున్నాడని చెప్పారు. అమితాబ్ తన గురించి చెప్పిన ఈ మాటలకే వర్మ ఏడ్చేశాడు. బిగ్ బీకి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నట్లు వర్మ పేర్కొన్నాడు.
Am very non emotional but was in tears when I read these excerpts from an interview of @SrBachchan https://t.co/MKHrxqD7Jy
— Ram Gopal Varma (@RGVzoomin) March 13, 2017