: యూపీ కొత్త ఎమ్మెల్యేలలో క్రిమినల్స్ ఎంత మంది? కోటీశ్వరులు ఎంత మంది?
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల పర్వం ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. అయితే, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మొత్తం ఎమ్మెల్యేలలో 143 మందిపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. వీరిపై వివిధ రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ ఎలక్షన్ వాచ్ ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో 107 మంది హత్యలు, మహిళలపై అత్యాచారాలు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ రాజకీయ ముసుగు వేసుకుని బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. యూపీ ఎన్నికల్లో మొత్తం 4,853 మంది పోటీ చేశారు. వీరిలో ఏకంగా 860 మందిపై వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది.
మరోవైపు అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 322 మంది కోటీశ్వరులే అని నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ ప్రతాప్ సింగ్ తనకు రూ. 49 కోట్ల విలువైన ఆస్తులతో పాటు, 60 కేజీల బంగారం ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 1,455 మంది కోటీశ్వరులే అని వెల్లడైంది.