: కేసీఆర్ గారూ.. ఇక రాజీనామా చేయండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు ఆ అంశంపై భేటీ అయి చర్చించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్.. అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తాము శాసనసభకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాసనసభ ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలోని అంశాలన్నీ అబద్ధాలేనని అన్నారు. ఎన్నికలకు ముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాటతప్పారని, ఇప్పుడు కూడా మాటలతోనే గారడీ చేస్తున్నారని ఆయన అన్నారు.
గవర్నర్‌కి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అన్నీ అసత్యాలే రాసిచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ లెక్కలు కూడా లేనివి ఉన్నట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. బడ్జెట్ రూపకల్పన కూడా లోపభూయిష్టంగా ప్రవేశపెట్టబోతున్నారని ఆరోపించారు. సర్కారు లెక్కలను తారుమారు చేస్తోందని తాము నిరూపిస్తామని, కేసీఆర్ ఇక రాజీనామా చేయాలని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం అంకెలను తారుమారు చేసిందని ఆయన మీడియాకు కొన్ని పత్రాలు చూపించారు. అవి చూశాకనైనా కేసీఆర్ రాజీనామా చేస్తారో చేయరో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఏ రెవెన్యూ లేకుండా సర్కారు అదనపు కేటాయింపులను చూపుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పినదానికి, చేసినదానికి పొంతన కుదరడం లేదని అన్నారు.