: మణిపూర్ కూడా బీజేపీ కైవసం... గోడ దూకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్!
అధికారం కోసం బీజేపీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ చిత్తవుతోంది. ఇప్పటికే గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు మణిపూర్ లో కూడా షాక్ తగిలింది. కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలిచిన శ్యామ్ కుమార్ సింగ్ గోడదూకారు. బీజేపీ నేతలతో కలసి ఆయన కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చకు తెరలేపింది. మరోవైపు స్థానిక పార్టీలు, టీఎంసీ, ఎల్జేపీల మద్దతు కూడగట్టుకున్న బీజేపీ, గవర్నర్ ను కలసి మద్దతు దారుల జాబితాను అందించింది.
మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 31 కాగా, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ 21, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1, నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ పార్టీ 4, లోక్ జనశక్తి పార్టీ ఒక్క సీటులో విజయం సాధించగా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓ స్థానంలో గెలిచారు. స్థానిక పార్టీలతో పాటు జంప్ జిలానీలపై ఆశలు పెట్టుకున్న బీజేపీ, మ్యాజిక్ ఫిగర్ ను సాధించినట్టే కనిపిస్తోంది. ఇదిలావుండగా, అధిక సీట్లు సాధించిన తమకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్ ను కోరింది.