: అధ్యక్షుడితో మాట్లాడడానికే ఆయన నిరాకరించారు... ప్రీత్ భారార తొలగింపుపై స్పందించిన వైట్ హౌస్
భారత సంతతి అమెరికన్, న్యూయార్క్, మన్ హటన్ అటార్నీ ప్రీత్ భారార తొలగింపుపై వైట్ హౌస్ స్పందించింది. ఆయనతో మాట్లాడేందుకు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని, అయినా, ఆయన మాట్లాడలేదని తెలిపింది. ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలపాలని భావించిన ట్రంప్, ప్రీత్ తో మాట్లాడాలని చూశారని, ఆయనకు మంచి భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాలని కూడా ట్రంప్ అనుకున్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తనపై అధికారుల అనుమతి తీసుకున్న తరువాతనే ట్రంప్ తో మాట్లాడాలని అనుకున్న ప్రీత్, వారికి చెప్పకుండా ట్రంప్ తో మాట్లాడేందుకు అంగీకరించలేదు.
కాగా, గత సంవత్సరం నవంబరులో ట్రంప్ ను కలిసిన ప్రీత్, అటార్నీగా రాజీనామా చేయాలని కోరినా, అంగీకరించని కారణంగానే ఆయన్ను తొలగించినట్టు తెలుస్తోంది. కాగా, తాను అటార్నీగా ఉన్న సమయంలో పలు వైట్ కాలర్ నేరాలతో పాటు ఆర్థిక నేరాల కేసుల్లో ఆయన ప్రభుత్వం తరఫున వాదించారు.