: ఇక తెలంగాణపై కన్నేసిన బీజేపీ... మ్యాజిక్ ఫిగరే లక్ష్యం!
ఉత్తరాదిలో సత్తా చాటి, ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ ముందుకు సాగుతున్న బీజేపీ కళ్లు దక్షిణాదిపై పడ్డాయి. కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ పెద్దగా ప్రాతినిధ్యం లేని ఆ పార్టీ దృష్టి తెలంగాణపై పడింది. 2019లో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కృషి చేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనున్న అమిత్ షా, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపాలని, మోదీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లే దిశగా నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిందని, ఇక ఆ పార్టీపై విమర్శల దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు, ఉద్యోగాల భర్తీ, ఇచ్చిన హామీల అమలు, ఎస్సీలకు భూమి, సింగరేణి కార్మికుల సమస్యలు తదితరాలపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నదే ఆ పార్టీ లక్ష్యమని తెలుస్తోంది.
ఇక తెలంగాణ పర్యటనకు వచ్చే అమిత్ షా, నల్గొండ, మెదక్ జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితిని, కేంద్రం అందిస్తున్న పథకాల అమలును ఆయన అంచనా వేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరును ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఆపై రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వ పర్యవేక్షణలోకి తీసుకుని తనదైన వ్యూహాన్ని అమలు చేసి, 2019 నాటికి పూర్తి ఫలితాలను రాబట్టాలన్నది అమిత్ ఆలోచనగా తెలుస్తోంది. కాగా, తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అనుకూల పరిస్థితి ఉందని బీజేపీ నేతలు అమిత్ షాకు నివేదికలు పంపిన సంగతి తెలిసిందే.