: భూమా మృతికి చంద్రబాబే కారణం!: ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన మరణానికి చంద్రబాబు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. భూమాపై అక్రమ కేసులను బనాయించిన చంద్రబాబు... ఆయనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. భూమా కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసి, టీడీపీలో చేర్చుకుని, అవమానాలకు గురి చేశారని విమర్శించారు. మంత్రి పదవి ఇచ్చే విషయంలో కూడా భూమాను చంద్రబాబు ఎంతో ఒత్తిడికి గురి చేశారని అన్నారు. భూమాపై ఎస్సీ, ఎస్టీ, ఎర్ర చందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు ఆయన మృత దేహాన్ని సందర్శించే అర్హత లేదని మండిపడ్డారు.