: చంద్రబాబుతో భూమా నాగిరెడ్డి చివరి మాటలివి!
తన జీవితంలో ఆఖరి క్షణం వరకూ నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన భూమా నాగిరెడ్డి, చనిపోయే ముందు రోజు సైతం అదే విషయం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించారు. దాదాపు 36 మందికి పైగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను వెంటబెట్టుకుని శనివారం నాడు ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లిన ఆయన చాలాసేపు చర్చించారు. చంద్రబాబంటే తనకు ఎంతో గౌరవమని, ఏ సమస్యతో వచ్చినా స్పందిస్తారని చెప్పారు.
తాను అడగగానే నంద్యాల నియోజకవర్గంలో 3 వేల మందికి వితంతు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. తనకు, శిల్పా చక్రపాణిరెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని, అందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గురించి బాబుతో గంటకు పైగా చర్చించారు. తన వెంటబెట్టుకుని వెళ్లిన వారిని పేరుపేరునా చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆపై అందరితో కలసి గ్రూప్ ఫోటో దిగారు. ఆదే ఆయనకు చివరి ఫోటో కావడం గమనార్హం.