: మావోల న్యూ టెక్నిక్.. బాణం బాంబులతో దాడులు!
పోలీసుల దాడులతో చితికిపోతున్న మావోయిస్టులు కొత్త తరహా దాడులకు పాల్పడుతున్నారు. శనివారం చత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడిచేసిన మావోలు రాకెట్ లాంచర్ల తరహాలో బాణాలకు ప్రెషర్ బాంబులు అమర్చి దాడులు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది జవాన్లపై బాణం బాంబుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
ఇప్పటి వరకు మావోలు ఎక్కువగా మందుపాతర్లనే నమ్ముకునేవారు. రోడ్డుపై మందుపాతర్లు అమర్చి పోలీసు వాహనం రాగానే దానిని పేల్చేవారు. అనంతరం కాల్పులకు తెగబడేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చారు. గిరిజనులకు విలువిద్యలో ఉన్న నైపుణ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాణాలకు బాంబులు అమర్చి పోలీసులపై దాడులకు దిగుతున్నారు. బాణం లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా కిందపడగానే బాంబు పేలుతుంది. దీంతో తమ లక్ష్యం నెరవేరుతుందని మావోలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.