: 46 మందిని బలితీసుకున్న చెత్తకుప్పలు.. అడిస్ అబాబాలో పెను విషాదం!
ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో పెను విషాదం చోటుచేసుకుంది. కొండలా పేరుకుపోయిన చెత్తకుప్పలు ఒక్కసారిగా కూలడంతో 46 మంది సజీవ సమాధి అయ్యారు. అడిస్ అబాబా శివారులోని కోషే వద్ద పేరుకుపోయిన చెత్తకుప్పలు కూలిపోయి దిగువన ఉన్న మురికివాడను దాదాపు నేలమట్టం చేశాయి. ఈ చెత్తకింద చిక్కుకుపోయిన వారిలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. చెత్తకుప్పలు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో 150 మంది వరకు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు యంత్రాల సాయంతో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి.
స్థానిక మురికివాడల్లోని ప్రజలకు ఈ చెత్తకుప్పలే జీవనాధారం. ఉదయాన్నే ఇక్కడకు చేరుకుని చెత్తను వెతికి అందులోని డబ్బాలు, సీసాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని విక్రయించి పొట్టపోసుకుంటారు. రోజూ తక్కువలో తక్కువగా 500 మంది ఇదే పనిలో ఉంటారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఇక్కడ పోగైన చెత్త పెద్ద కొండలా పేరుకుపోయింది. ఇన్నాళ్లూ వారికి బతుకినిచ్చిన ఆ చెత్తకుప్పే ఇప్పుడు వారి ప్రాణాలను తీసింది.