: అవకాశాల పేరుతో పడకగదికి రమ్మనడం సినీ పరిశ్రమలో మామూలే..!: సీనియర్ నటి కస్తూరి ఆవేదన
అవకాశాల పేరుతో పడకగదికి రమ్మనే అలవాటు సినీ పరిశ్రమలో ఉందని, అటువంటి బాధితుల్లో తాను కూడా ఒకదానినని సీనియర్ నటి కస్తూరి పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో అమెరికాకు చెందిన వైద్యుడిని పెళ్లాడి అక్కడే స్థిరపడిన కస్తూరి తన కుమార్తెకు నృత్యం నేర్పించేందుకు ఇటీవల చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ అవకాశాల పేరుతో పడకగదికి రమ్మనే అలవాటు సినీ పరిశ్రమలో ఉందన్నారు. కొందరు ఆలోచనా రాహిత్యంతో, మరికొందరు పారితోషికం విషయంలో డిమాండ్ కారణంగా, ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై నటిగా ఎదగలేకపోతున్నారని అన్నారు.
తన విషయంలో వారు ఆశించింది జరగకపోవడంతో వారి సినిమాల నుంచి తనను తప్పించారని పేర్కొన్నారు. ఓ హీరో కారణంగానే అలా జరిగిందని పేర్కొన్న కస్తూరి, ఇప్పుడా హీరో రాజకీయాల్లో ఉన్నాడని తెలిపారు. అతడికి ఇగో అని, అయినా తాను అతడిని గౌరవిస్తానని తెలిపారు. ‘నో’ చెబితే ఆయన తట్టుకోలేరని అన్నారు. అతడితో ఓ సినిమాలో కూడా నటించానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనపై విసుక్కునేవారని, కోపంగా ఉండేవారని అన్నారు. ఆ తర్వాత అతడి రెండు చిత్రాల నుంచి తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన కస్తూరి, ఆ హీరో పేరును మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా ఇప్పటికే ఇటువంటి ఆరోపణలు రోజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నాయి. ఇటీవల రెజీనా, నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సంధ్య కూడా సినీ పరిశ్రమలో తమ అనుభవాలను వెల్లడించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.