: బలమైన నాయకుడిని కోల్పోయామన్న టీడీపీ నేతలు
టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై రాయలసీమలో టీడీపీ బలమైన నాయకుడిని కోల్పోయిందని ఏపీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. భూమా మృతి టీడీపీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. మరో మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, భూమా ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా పట్టుదలతో చేసే వారని, ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
మరో టీడీపీ నేత, ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, భూమాతో చిన్నప్పటి నుంచి తనకు సత్సంబంధాలున్నాయని, కుటుంబ సభ్యుల్లా మెలిగే వారమని, కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయన పెనుమార్పులు తెచ్చారని, భూమా మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. కాగా, టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత నందమూరి హరికృష్ణ స్పందిస్తూ, బలమైన నాయకుడిని కోల్పోయామని, భూమా తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు. ఆయన మృతికి తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.