: ఆ ధైర్యంతోనే ఆరేళ్ల కిందట పార్టీ స్థాపించా: వైఎస్ జగన్
నాయకులు, కార్యకర్తలు తనపై ప్రేమ చూపించడం ద్వారా వచ్చిన ధైర్యంతోనే ఆరేళ్ల కిందట తాను వైఎస్సార్సీపీని స్థాపించి, ముందుకు వెళుతున్నానని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఓ ట్వీట్ చేశారు. తనపై ప్రేమ చూపించిన కార్యకర్తలు, నాయకుల వల్ల తాను పార్టీ స్థాపించడానికి, తన తండ్రి, ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలలను కొనసాగించేందుకు కావాల్సినంత ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతి పేదవాడి కళ్లలో సంతోషం చూసే తరుణం మరెంతో దూరంలో లేదని, మరో ఏడాదిలో అందరం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని, లక్ష్యానికి ఏడాది దూరంలో ఉన్నామని తన ట్వీట్ లో జగన్ పేర్కొన్నారు.