: 'రాయల తెలంగాణ' ప్రతిపాదన భూమాదే... రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను తెలంగాణతోనే ఉంచాలన్నారు!
నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాయల తెలంగాణ (రాయలసీమ, తెలంగాణలను ఒకే రాష్ట్రంగా ఉంచాలనే) ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ప్రతిపాదనను తొలుత 2007లో వెల్లడించింది నాడు టీడీపీ నేతగా ఉన్న భూమా నాగిరెడ్డే. ‘‘రాష్ట్ర విభజన తప్పనిసరి అయితే రాయలసీమను తెలంగాణతోనే కొనసాగించాలి గానీ ఆంధ్రతో వద్దు. రాయలసీమ ప్రజలు సాంస్కృతికంగా, మానసికంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉంటారు’’ అని భూమా నాగిరెడ్డి అప్పట్లో తన ప్రతిపాదన వెనుకనున్న కారణాలు వివరించారు.
రాయలసీమ ప్రజలను ఆంధ్ర నేతలు మోసగించారని కూడా ఆయన ఆరోపించారు. శ్రీ భాగ్ ఒప్పందాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం కూడా తెలంగాణ మాదిరిగా తీవ్ర కరవును, వెనుకబాటు తనాన్ని ఎదుర్కోంటోందన్నారు. ఈ రెండు ప్రాంతాలను గతంలో నిజాములు పాలించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. రాయలసీమ, తెలంగాణ ఒక విధమైన వెనుకబాటు తనాన్ని ఎదుర్కొంటుంటే... సహజ వనరులను కోస్టల్ ఆంధ్రా కొల్లగొడుతోందన్నారు. కోస్తాంధ్రలో 90 శాతం సాగు భూమికి నదీ నీరు పారుతుంటే, మిగిలిన రాష్ట్రం మొత్తంలో 45 శాతం సాగు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. భూమా వ్యాఖ్యలపై అప్పట్లో టీడీపీ పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయలో ఏ నేతా తన అభిప్రాయలు బహిర్గతంగా చెప్పడానికి వీల్లేదని టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం ఆదేశించారు.