: 13 సార్లు అవుటైనా వెనకడుగు వేసేది లేదు: డేవిడ్ వార్నర్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో షాట్లు ఆడటంలో వెనక్కి తగ్గేది లేదని డేవిడ్ వార్నర్ తెలిపాడు. అశ్విన్ బౌలింగ్ లో ఆడడంపై వ్యూహం మార్చారా? అని అడగడంతో స్పందించిన వార్నర్... అశ్విన్ బౌలింగ్ లో షాట్లు ఆడడం అంత సులభం కాదని చెబుతూనే ... ఆ విషయంలో తాను వెనక్కి తగ్గేది మాత్రం లేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ సిరీస్ లో జరిగిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్ లలో వార్నర్ మూడు సార్లు అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
దీంతో 9 సార్లు ఒక బౌలర్ చేతిలో అవుటైన ఆటగాడిగా అపఖ్యాతి వార్నర్ మూటగట్టుకోగా, టెస్టుల్లో 13 సార్లు ఒకే ఆటగాడిని అవుట్ చేసిన ఘనత అశ్విన్ ఖాతాలో వచ్చి చేరింది. అశ్విన్ ప్రమాదకర బౌలర్ అని, అతని బౌలింగ్ లో ఆడడం సవాల్ అని తెలిపాడు. ఆ సవాల్ ను స్వీకరించేందుకు తాను సదా సిద్ధమని చెప్పాడు. బ్యాట్ సైజు కుదించాలన్న నిర్ణయం వల్ల పెద్దగా ఫలితం ఉండదని వార్నర్ తెలిపాడు. అయితే క్రికెట్ లో ఎలాంటి మార్పులు వచ్చినా వాటిని స్వాగతించాల్సిందేనని వార్నర్ స్పష్టం చేశాడు.